గ్రామాలకు మా సహకారం అందిస్తాం: పవన్ కల్యాణ్‌తో కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ

  • తమిళనాడులోని మనవాడి గ్రామంలో సహకారం అందిస్తున్నట్లు వెల్లడి
  • ఏపీలోనూ అలాంటి సహకారం అందిస్తామన్న కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ
  • రమేశ్ బాబు నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈవో బి.రమేశ్ బాబు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల అభివృద్ధికి తమ బ్యాంకు ద్వారా తమవంతు సహకారం అందిస్తామని పవన్ కల్యాణ్‌కు తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో తమ బ్యాంకు ద్వారా సహకారం అందిస్తున్నామని... అలాంటి కార్యక్రమాలు ఏపీలోనూ చేపడతామన్నారు.

తమిళనాడులోని కరూర్ జిల్లా మనవాడి గ్రామంలో తమ బ్యాంకు ద్వారా జలవనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామీణులకు పాడి పరిశ్రమలో చేయూత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ద్వారా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఏపీలో గ్రామాభివృద్ధికి కరూర్ వైశ్యా బ్యాంకు ముందుకు రావడం పట్ల జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఎన్నారైలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీకి విజ్ఞప్తి చేశారు.

వివిధ సంస్థలు, కంపెనీలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో స్థానికులకు కూడా బాధ్యత కల్పించే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున తప్పకుండా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.


More Telugu News