బడ్జెట్‌లో ఏపీ పేరు పలుమార్లు ఉచ్చరించారు.. తెలంగాణను పక్కన పెట్టారు: హరీశ్ రావు

  • ఏపీలో పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారన్న హరీశ్ రావు
  • ఏపీ రాజధానికి డబ్బులు ఇస్తామని చెప్పారన్న మాజీ మంత్రి
  • ఏపీకి ఇవ్వడం సంతోషమే... కానీ తెలంగాణకు ఏమైందో చెప్పాలని నిలదీత
కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పేరును అనేకసార్లు ఉచ్చరించారని, కానీ తెలంగాణను పక్కన పెట్టారన్నారు. మీడియా పాయింట్ వద్ద ఆయన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఏపీలో పోల‌వ‌రం త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేస్తామని చెప్పారని, ఏపీ రాజ‌ధానికి డ‌బ్బులు ఇస్తామని చెప్పారని, రాయ‌ల‌సీమ‌తో పాటు ఆంధ్రాలోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీ విషయంలో ప్ర‌త్యేకంగా ఈ అంశాలను ప్ర‌స్తావించ‌డం సంతోష‌మే కానీ, తెలంగాణ విష‌యం ఏమైందో చెప్పాలన్నారు. మ‌రి ఈ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.

కేంద్రంతో స‌త్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నామని... మోదీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నామని... కేంద్రమంత్రుల‌ను రోజూ కలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని... మరి నిధుల కేటాయింపుపై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. క‌నీసం తెలంగాణ ప్ర‌స్తావ‌న కూడా లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ క‌లిసి తెలంగాణ‌కు అన్యాయం చేశాయన్నారు.


More Telugu News