కేంద్రం నిధులు అప్పుల రూపంలోనే అయినా... వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే!: సీఎం చంద్రబాబు

కేంద్రం నిధులు అప్పుల రూపంలోనే అయినా... వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే!: సీఎం చంద్రబాబు
  • నేడు కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నిర్మలా సీతారామన్ 
  • ఈ బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించేలా ఉందన్న చంద్రబాబు
  • తాము పెట్టిన ప్రతిపాదనలను కేంద్రం చాలా వరకు ఆమోదించిందని వెల్లడి
అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. తాము పెట్టిన ప్రతిపాదనలను చాలావరకు ఆమోదించారని వెల్లడించారు. 

రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి ఎంతో ఉపయోగం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికంగా కుంగుబాటుకు గురైన ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని అన్నారు. 

"రాజధాని నిర్మాణం ఊపందుకోవాలంటే ఈ నిధులు ఉపయోగపడతాయి. ఏజెన్సీల నుంచి అందే నిధులు అప్పుల రూపంలోనే అయినా... వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో ఇస్తుంది. అందులోనే కొంత కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కలిసి ఉంటుంది. 

పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు కావాలి అని మేం ప్రతిపాదన పెట్టలేదు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం చెప్పింది. 

ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా సాయం ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నిబంధనలు పరిశీలించాక, మనకు అనువుగా మలుచుకుంటాం" అని చంద్రబాబు వివరించారు.


More Telugu News