ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కూటమి
  • అధికారంలోకి వచ్చాక మాట నిలుపుకుంటున్న వైనం
  • నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అనగాని
తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం... రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. 

"మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి... వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి" అంటూ అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 

దీనిపై శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పైకి లేచి... మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయం అని అయ్యన్నపాత్రుడిని అభినందించారు. పైగా, మా అందరికీ ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అంటూ చమత్కరించారు. ఈ రోజు నుంచి మీరొక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పయ్యావుల పేర్కొన్నారు.


More Telugu News