తొమ్మిది రంగాల్లో నాలుగింటికి పెద్దపీట.. భవిష్యత్తు బడ్జెట్‌లకు ఇది రహదారి: నిర్మలా సీతారామన్

  • వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • మోదీ 3.0 ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించిన ఆర్థిక మంత్రి
  • వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే పథకాలు
  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల కేటాయింపు
  • ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వరుసగా ఏడోసారి 2024 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు బడ్జెట్‌లకు ఇది మార్గనిర్దేశనం చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వ 9 ప్రాధామ్యాలను ఆమె హైలైట్ చేశారు. 

ఈ తొమ్మిదింటిలో వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితి స్థాపకత, ఉపాధి, నైపుణ్యం, మెరుగైన మానవ వనరులు, సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తర్వాతి తరం సంస్కరణలు ఉన్నాయి. భవిష్యత్ బడ్జెట్‌లు కూడా ఈ బడ్జెట్‌లోని ప్రాధామ్యాలపై ఆధారపడి ఉంటాయని నిర్మల తెలిపారు.

పైన పేర్కొన్న తొమ్మిదింటిలో ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) మధ్యతరగతి అనే నాలుగు ప్రాథమిక రంగాలపై ఈ బడ్జెట్ దృష్టి సారిస్తుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్లమంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని చెప్పారు. అలాగే విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాతీయ సహకార రంగాన్ని రూపొందించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలును సులభతరం చేస్తారు. అలాగే, ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభిస్తారు. రైతులకు సాయం చేసేందుకు 10 వేల అవసరాల ఆధారిత బయో ఇన్‌పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వందకుపైగా అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల 32 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల వంగడాలు విడుదల చేస్తారు.


More Telugu News