స్మిత సబర్వాల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎంపీ లక్ష్మణ్

  • దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఫైర్
  • వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఎంపీ
  • చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ లీడర్
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దివ్యాంగులను అవమానించేలా మాట్లాడిన స్మిత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో స్మితను తప్పుబడుతూ పలువురు ప్రముఖులు స్పందించగా.. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశంపై స్పందించారు. స్మిత ట్వీట్ దివ్యాంగులను కించపరిచేలా ఉందని విమర్శించారు. దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మిత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సమాజంలో గౌరవప్రదంగా ఉండాలనే ఆలోచనతో వికలాంగులు అనే పదం స్థానంలో దివ్యాంగులుగా వ్యవహరించాలని మోదీ సర్కారు 2016 లో చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ చర్య దివ్యాంగుల మనోబలాన్ని పెంచిందని పేర్కొన్నారు. దివ్యాంగులపై చేసిన ట్వీట్ ను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని స్మిత సబర్వాల్ కు సూచించారు. అదేవిధంగా ఈ విషయంపై స్పందించి ప్రభుత్వపరంగా స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరారు.


More Telugu News