మదనపల్లె ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు కనిపించడంలేదు: డీజీపీ

  • మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం
  • కీలక ఫైళ్లు దగ్ధమైనట్టు అనుమానం
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటన స్థలికి వెళ్లిన డీజీపీ
  • దాదాపు 3 గంటల పాటు పరిశీలన
  • ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని వెల్లడి
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలోని సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా ముందుకు వచ్చారు. 

గత రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. మూడు గంటల పాటు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు.

మదనపల్లె ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు కనిపించడంలేదని, ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓల్టేజిలో హెచ్చుతగ్గులు లేవని, షార్ట్ సర్క్యూట్ కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. కార్యాలయం కిటికీ వెలుపల కొన్ని అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు. అదే సమయంలో ఈ కార్యాలయంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడంలేదని తెలిపారు. 

జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదు... ఇన్సిడెంట్ అని అర్థమవుతోందని... ఈ ఘటనపై ఎస్పీ, డీఎస్పీలకు స్థానిక సీఐ సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. ఆర్డీవో కూడా కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనలో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం కనిపిస్తోందని, సమగ్ర విచారణ జరగాల్సి ఉందని అన్నారు. 

ఈ ఘటనను ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్ మెంట్ తీవ్రంగా పరిగణిస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. దర్యాప్తు కోసం 10 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో అన్ని వివరాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు.


More Telugu News