యూట్యూబ్‌లో అంతరాయం... ఎక్స్ వేదికగా స్పందించిన నెటిజన్లు

  • సోషల్ మీడియా వేదికగా స్పందించిన నెటిజన్లు
  • అప్ లోడింగ్‌లో సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడి
  • ట్రెండింగ్‌లో #YouTubeDown హ్యాష్‌ట్యాగ్
భారత్‌లో చాలామంది వినియోగదారులు యూట్యూబ్‌లో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య కారణంగా యూట్యూబ్ యాప్, వెబ్ సైట్‌లో అంతరాయం ఏర్పడింది. చాలామంది నెటిజన్లు యూట్యూబ్ సాంకేతిక సమస్యపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొంతమంది ఎలాంటి సమస్య లేకుండా యాక్సెస్ చేయగలుగుతున్నారు. కానీ చాలామంది మాత్రం తమ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నప్పుడు సమస్యను ఎదుర్కొన్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

#YouTubeDown అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్ వేదికలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక్కడ ఎంతోమంది వినియోగదారులు తమ అనుభవాన్ని పంచుకున్నారు. సమస్యను పరిష్కరించేందుకు యూట్యూబ్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. సాంకేతిక సమస్యపై యూట్యూబ్ అధికారిక ఎక్స్ వేదిక స్పందించింది. సమస్యను గుర్తించినందుకు ధన్యవాదాలు... సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య ప్రారంభమైంది.

యూట్యూబ్ అంతరాయానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ... నిర్వహణ కార్యకలాపాల సమస్య లేదా నెట్ వర్క్ సమస్య అయి ఉంటుందని భావిస్తున్నారు.

యూట్యూబ్ అంతరాయాన్ని ఎదుర్కొనే వినియోగదారులు ఇలా చేసి చూడండి... 1. క్యాచ్ అండ్ కుకీలను క్లియర్ చేయాలి. కొన్ని సందర్భాలలో వీటిని క్లియర్ చేయడం ద్వారా వెబ్ సైట్ లోడింగ్ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. 2. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను తనిఖీ చేసుకోండి. 3. డౌన్ అయితే ప్రత్యామ్నాయ నెట్ వర్క్ పరికరాలను ఉపయోగించండి. మరో నెట్ వర్క్ పరికరం ద్వారా యూట్యూబ్ యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేసి చూడండి.


More Telugu News