మంత్రి పొంగులేటిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

  • మంత్రి కంపెనీకి సంబంధించిన చాలా అంశాలు తన వద్ద ఉన్నాయన్న ఏలేటి
  • యూరో ఎగ్జిమ్ బ్యాంకు కుంభకోణంలో మంత్రి కంపెనీ భాగస్వామి అని ఆరోపణ
  • పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రికి సంబంధించిన కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి సంబంధించి చాలా అంశాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన కంపెనీ యూరో ఎగ్జిమ్ బ్యాంకు కుంభకోణంలో భాగస్వామి అని సంచలన ఆరోపణలు చేశారు.

యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీ పొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ ఉండదని గుర్తు చేశారు. ఇది ఖండాంతరాలు దాటి ఒక దీవిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీ అన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. 

యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఇష్టారీతిన పలు సంస్థలకు ఫేక్ గ్యారెంటీలను ఇస్తోందంటూ ఓ ఛానల్లో కథనం వచ్చింది. వార్షిక టర్నోవర్ రూ.8 కోట్లు కూడా లేని సదరు బ్యాంకు వేల కోట్ల రూపాయల గ్యారెంటీలు ఇస్తోందని అందులో ప్రశ్నించారు. అయితే తమపై వచ్చిన కథనానికి సంబంధించి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని యూరో ఎగ్జిమ్ బ్యాంకు వెల్లడించింది. తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పి... సదరు వీడియోలను, పోస్టులను తొలగించాలని ఆ బ్యాంకు డిమాండ్ చేస్తోంది.


More Telugu News