జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడిన రఘురాజు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదే!

  • హాయ్ జగన్ అని పలుకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన రఘురాజు
  • ప్రతి రోజు అసెంబ్లీకి రావాలన్న ఉండి ఎమ్మెల్యే
  • జగన్ పక్కన సీటు కేటాయించాలని కేశవ్ ను కోరిన రఘురాజు
  • జగన్ పక్కన కూర్చుంటే మజా ఉంటుందని వ్యాఖ్య
  • జగన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమన్న రఘురాజు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై ప్రతిరోజు విమర్శలు గుప్పించే టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయనతో ముచ్చటించారు. జగన్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే సమయానికి... అప్పటికే అక్కడ ఉన్న రఘురాజు... 'హాయ్ జగన్' అని పలుకరించారు. జగన్ ముందుకు కదిలిన తర్వాత ఆయనతో పాటు వెళ్లి, ఆయన వరుసలో కూర్చున్నారు. 

కాసేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుందనగా... లేచి వెళ్లి జగన్ పక్కన రఘురాజు కూర్చున్నారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ... రోజూ అసెంబ్లీకి వస్తాను, మీరే చూస్తారని అన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు రఘురాజును అసెంబ్లీ లాబీలోకి పిలిపించారు. జగన్ తో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. 

అసెంబ్లీకి ప్రతి రోజు రావాలని జగన్ కు చెప్పానని రఘురాజు మీడియాకు వివరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే మజా ఏముంటుందని అన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీలో వెళ్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడుతూ... అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరారు. దీనికి సమాధానంగా అలాగేనని కేశవ్ నవ్వుతూ చెపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఆ తర్వాత జగన్ పక్క సీటును మీరు ఎందుకు కోరుకుంటున్నారని రఘురాజును మీడియా ప్రశ్నించగా... మజా ఉంటుందని, మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. జగన్ ను రోజూ ర్యాగింగ్ చేస్తారా? అని పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే ప్రశ్నించగా... ర్యాగింగ్ చేస్తానో, మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని అన్నారు. 

జగన్ కు షేక్ హ్యాండ్ ఎందుకిచ్చారని మీడియా ప్రశ్నించగా... అది తన ధర్మం అని చెప్పారు. మీ షేక్ హ్యాండ్ పట్ల జగన్ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని మరికొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా... జగన్ ఎలా రెస్పాండ్ అయినా, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమని అన్నారు. అసెంబ్లీలో జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే... ఆయనకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెపుతానని తెలిపారు. మరోవైపు జగన్ తో రఘురాజు మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


More Telugu News