ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్రాన్స్ ఎంపీ సంచలన ప్రకటన

  • పాలస్తీనా అనుకూల ర్యాలీలో ఫ్రాన్స్ ఎంపీ థామస్ సంచలన వ్యాఖ్యలు
  • పాలస్తీనాతో యుద్ధంలో పాల్గొన్న కారణంగా ఇజ్రాయెల్ అథ్లెట్లకు స్వాగతం పలకలేమని స్పష్టీకరణ
  • ఇజ్రాయెల్‌పై రష్యా తరహా చర్యలు తీసుకోవాలని సూచన
  • ఇజ్రాయెల్ పతాకం, జాతీయగీతంపై నిషేధం విధించేలా ఒలింపిక్స్ కమిటీపై ఒత్తిడి తేవాలని పిలుపు
పారిస్ వేదికగా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొంటున్న కారణంగా వారికి స్వాగతం పలికేది లేదంటూ ఆయన కలకలం రేపారు. పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై నిషేధం విధించాలని అన్నారు. ఈ దిశగా మార్పుల కోసం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీపై ఫ్రాన్స్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలన్నారు. ఈ నేపథ్యంలో థామస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు, థామస్ వ్యాఖ్యలను ఫ్రాన్స్ యూదుల గ్రూపు ప్రతినిధి ఆర్ఫీ ఖండించారు. అథ్లెట్లను లక్ష్యం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే అథ్లెట్లకు ప్రమాదం పొంచి ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1972 ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లను హత్య చేసిన ఉదంతాన్ని గుర్తు చేశారు.


More Telugu News