మధ్యప్రదేశ్‌లో దారుణం.. బతికుండానే మహిళలను పూడ్చేయత్నం.. వీడియో ఇదిగో!

  • ప్రైవేటు భూమిలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడమే కారణం
  • డంపర్‌లో మట్టి తెచ్చి మహిళలపై పోసిన నిందితులు
  • పీక లోతువరకు కూరుకుపోయిన మహిళలు
  • సకాలంలో స్థానికులు స్పందించి రక్షించిన వైనం
  • నిందితుల్లో ఒకరి అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళలను సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయగా, స్థానికులు సకాలంలో స్పందించడంతో వారు బతికి బయటపడ్డారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొందరు వ్యక్తులు ట్రక్కులో మట్టి తెచ్చి వారిపై పోసి సజీవంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు.  

బాధితులను మమతా పాండే, ఆశా పాండేగా గుర్తించారు. మంగ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జరోట్ గ్రామంలోని ఓ ప్రైవేటు భూమిలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడమే అందుకు కారణమని పోలీసులు తెలిపారు. వారిని మెడల వరకు పాతిపెట్టినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

బాధిత మహిళలను రక్షించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి డంపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

భూ తగాదాలే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది. ఈ ఘటనపై బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం మౌనంగా ఉండడంపై కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. జాతీయ మహిళా కమిషన్, ప్రధానమంత్రి, హోంమంత్రి, మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వశాఖలు ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించింది.


More Telugu News