హార్దిక్ పాండ్యాకు అన్యాయం చేశారు.. సంజయ్ బంగర్ విమర్శలు

  • టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ స్పందన
  • ఈ నిర్ణయం పాండ్యాను తీవ్రంగా బాధిస్తుందని వ్యాఖ్య
  • సూర్య విలువైన ఆటగాడే అయినా పాండ్యాను పక్కన పెట్టారంటూ సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించిన నాటి నుంచి అతడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అతడిని ఎగతాళి చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలిచాడు. తాజాగా టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి పాండ్యాను తొలగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెలెక్టర్లు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇచ్చి అతనిని టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ తిరస్కరించడంపై కొందరు మాజీలు పెదవి విరుస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ కూడా చేరిపోయాడు.

కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌కు విలువైన అనుభవం ఉన్న మాట నిజమేనని, అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీని హార్దిక్‌కు అప్పగించకపోవడం అతడికి అన్యాయం చేయడమేనని సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. సూర్యను కెప్టెన్‌గా ప్రకటించడం హార్దిక్ పాండ్యాను తీవ్రంగా బాధిస్తుందని వ్యాఖ్యానించాడు. రోహిత్ తర్వాత కెప్టెన్ రేసులో ఉన్నది అతడేనని, అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం తనకు కొంత ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించాడు. మునుపటి టీ20 వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ కెప్టెన్‌గా ఎంపిక చేయకపోయుంటే.. ఆ సమయంలో హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా ఎంపిక చేసేవారని అన్నాడు. 

భారత జట్టు ఆ దిశగానే పయనిస్తోందని అనిపించిందని, సెలెక్టర్లు కూడా ఆ మార్గంలోనే వెళ్తున్నారని అనిపించిందని, కానీ ఈ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకున్నారని సంజయ్ బంగర్ అన్నారు. అయితే సెలక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రధాన కోచ్ హార్దిక్ పాండ్యాతో మాట్లాడినట్టు తాను వార్తలు చదివానంటూ ఆయన ప్రస్తావించారు. ఈ మేరకుస్టార్ స్పోర్ట్స్‌లో బంగర్ వ్యాఖ్యానించారు.


More Telugu News