వజ్రాల నెక్లెస్‌ను పొరపాటున చెత్తలో విసిరేసిన ఓనర్.. వెతికి తీసిన మున్సిపల్ సిబ్బంది!

  • చెన్నైలో వెలుగు చూసిన ఘటన
  • మనవరాలి పెళ్లికి నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చిన మహిళ
  • ఏమరపాటులో ఆభరణాన్ని చెత్తలో విసిరేసిన యువతి తండ్రి
  • వెంటనే ఫిర్యాదు చేయడంతో వెతికి తీసిన సిబ్బంది
ఓ వ్యక్తి పొరపాటున చెత్తలో పడేసిన వజ్రాల నెక్లెస్‌ను మున్సిపల్ సిబ్బంది వెతికి తీసిన ఘటన చెన్నైలో తాజాగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో అతడి తల్లి తన మనవరాలికి రూ.5 లక్షల ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చింది. అయితే, దేవరాజ్ పొరపాటున దాన్ని చెత్తలో పడేయడంతో దాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లిపోయారు. 

జరిగిన పొరపాటును గుర్తించిన దేవరాజ్ వెంటనే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించారు. దీంతో చెత్త నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ ఉర్బసెర్ సుమీత్ రంగంలోకి దిగింది. సంస్థకు చెందిన డ్రైవర్ జె. ఆంథొనీస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది సమీపంలోని చెత్తబుట్టల్లో వెతికారు. ఓ పూలదండకు చిక్కుకుని ఉన్న నెక్లెస్‌ను గుర్తించి దాన్ని యజమానికి అందజేశారు. ఆభరణం దొరకడంతో సంతోషించిన దేవరాజ్.. ఆంథొనీస్వామి, ఇతర మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఫిర్యాదు చేయగానే వారు వెంటనే స్పందించారని కొనియాడారు.


More Telugu News