సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం

  • రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • రేపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు దుస్తులు వేసుకురావాలన్న టీడీఎల్పీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ భవనంలో టీడీఎల్పీ భేటీ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.  

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు (జులై 22) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ స్పష్టం చేసింది. 

అటు, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా, లేదా అనేదానిపై స్పష్టత లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఈ నెల 24న ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో ధర్నా చేసేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది.


More Telugu News