ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు ఆడనంత మాత్రాన క్రికెటేమీ అంతం కాదు!: హసన్ అలీ

  • భారత్ జట్టు లేకుండానే టోర్నీ ఆడేందుకు సిద్ధమన్న హసన్ అలీ
  • మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతాయని వ్యాఖ్య
  • ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత్ జట్టు పాక్ వెళ్తుందా లేదా అనే చర్చ వేళ ఆసక్తికర వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు భారత్ జట్టు ఆతిథ్య పాకిస్థాన్ వెళ్తుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పాక్ క్రికెటర్ హసన్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు లేకుండానే ఆడేందుకు తాము సిద్ధమయ్యామని వ్యాఖ్యానించాడు. 

"మేము (పాకిస్థాన్) భారత్ వెళ్లి ఆడినప్పుడు.. వారు కూడా పాకిస్థాన్ రావాలి కదా. చాలా మంది భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌లో ఆడాలని కోరుకుంటున్నట్టు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ఆటగాళ్లు వారి దేశ విధానాలను, దేశాన్ని, క్రికెట్ బోర్డును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని హసన్ అలీ పేర్కొన్నాడు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన ‘సమా’ అనే న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

భారత్ పాల్గొనకపోతే క్రికెట్ ముగిసిపోయినట్టు కాదు

భారత్ లేకుండా టోర్నీ ఆడటంపై ప్రశ్నించగా హసన్ అలీ ఆగ్రహంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. "ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తోంది అంటే, మ్యాచ్ లన్నీ పాకిస్థాన్ లోనే జరుగుతాయని అర్థం. పీసీబీ చైర్మన్‌ కూడా ఇదే చెప్పారు. కాబట్టి భారత్‌ జట్టు మా దేశానికి రాకూడదనుకుంటే వాళ్లు లేకుండానే టోర్నీ ఆడతాం. భారత్ పాల్గొనకపోతే క్రికెటేమీ అంతమైపోయినట్టు కాదు" అని వ్యాఖ్యానించాడు.

కాగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదంటూ బీసీసీఐ చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2023లో ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ... భారత్ పట్టుపట్టడంతో హైబ్రీడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహించారు. భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు.

అయితే అదే ఏడాది జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని కూడా హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించాలంటూ ఐసీసీకి బీసీసీఐ ప్రతిపాదన చేసింది. భారత మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు.


More Telugu News