ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి మృతి... ఒకదానికి బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారంటున్న కుటుంబ సభ్యులు

ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ఇంజెక్షన్ కు బదులు మరో ఇంజెక్షన్‌ ఇవ్వడంతో 28 ఏళ్ల యువతి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేరళలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఐదు రోజుల క్రితం డాక్టర్ రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చాడని, ఐదు రోజులు అపస్మారక స్థితిలో ఉన్న తర్వాత ఆదివారం ఉదయం చనిపోయిందని చెబుతున్నారు. మృతురాలి పేరు కృష్ణ తంకప్పన్‌ అని, మలయిన్‌కీజ్‌కు సమీపంలోని నెయ్యట్టింకర జనరల్ హాస్పిటల్‌‌లో ఆమె తుది శ్వాస విడిచిందని పేర్కొన్నారు.

మృతురాలు కృష్ణ తంకప్పన్ గత 5 రోజులుగా అపస్మారక స్థితిలో ఉండి చనిపోవడానికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని, హాస్పిటల్‌‌లో పనిచేస్తున్న విను అనే వైద్యుడు రాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి భర్త శరత్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 125 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత రక్షణకు హాని కలిగించిన వారిపై ఈ కేసు పెడతారు.

కాగా ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. అప్పటికే కొన్ని అలర్జీ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళ కిడ్నీల్లో రాళ్ల సమస్యతో డాక్టర్ వినుని సంప్రదించి హాస్పిటల్‌లో చేరింది. అయితే ఎలాంటి అలర్జీ పరీక్ష నిర్వహించకుండానే రోగికి ఇంజక్షన్‌ ఇచ్చారని, యువతి ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదేనని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

అయితే ఈ ఆరోపణలను కేరళ ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం ఖండించింది. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు ఇచ్చే సాధారణ ఇంజక్షన్‌ అనాఫిలాక్సిస్‌ను వైద్యుడు ఇచ్చాడని అసోసియేషన్ పేర్కొంది. తీవ్రమైన అలర్జీ కారణంగా రియాక్షన్ వచ్చి మహిళ చనిపోయి ఉండొచ్చని, ఇది వైద్యుడి నిర్లక్ష్యమని చెప్పలేమని అసోసియేషన్ పేర్కొంది.


More Telugu News