కేరళలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ నిర్ధారణ

  • పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో శాంపుల్స్ పరీక్షించగా పాజిటివ్
  • కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటన
  • వైరస్ కేంద్రమైన పండిక్కాడ్‌తో పాటు చుట్టుపక్కల ప్రజలకు అప్రమత్తత ప్రకటన
దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేగింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి శాంపుల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో (ఎన్ఐవీ) పరీక్షించామని వెల్లడించారు.

బాలుడు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. పర్యవేక్షణతో కూడిన చికిత్స కోసం అతడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలిస్తామని ఆమె వివరించారు. బాలుడిని కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను ఇప్పటికే వేరు చేశామని, వారి నమూనాలను సైతం పరీక్షల కోసం పంపామని వీణా జార్జ్ మీడియాకు వివరించారు. చికిత్స పొందుతున్న బాలువు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడని ఆమె చెప్పారు.

నిఫా వైరస్ కేంద్రం పండిక్కాడ్ అని, ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు. వైరస్ కేంద్రం పండిక్కాడ్‌తో పాటు సమీపంలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించాలని, ఆసుపత్రులలో పెషెంట్లను సందర్శించడం మానుకోవాలని సూచనలు చేసినట్టు మంత్రి తెలిపారు. కాగా గతంలోనూ నాలుగు సార్లు కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వణికించింది. 2018, 2021, 2023లలో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకులం జిల్లాలో నిఫా కేసులు నిర్ధారణ అయ్యాయి. కోజికోడ్, వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిఫా వైరస్ యాంటీబాడీల ఉనికిని గుర్తించారు.

కాగా నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది.


More Telugu News