నెట్ ప్రాక్టీస్‌లో నన్ను ఎదుర్కోవడం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇష్టం ఉండదు: మహ్మద్ షమీ

  • కోహ్లీ కొన్ని సార్లు ఆడాడని స్టార్ పేసర్ వెల్లడి
  • రోహిత్ మాత్రం ఆడబోనని వెంటనే చెప్పేస్తాడన్న షమీ
  • ప్రాక్టీస్‌లో రోహిత్ లేదా విరాట్‌లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టమని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం
  • చీలమండ శస్త్ర చికిత్స నుంచి కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన షమీ
వన్డే ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా రాణించినప్పటికీ చీలమండ గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2024కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న షమీ ఇటీవలే నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇటీవల శుభంకర్ మిశ్రా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

నెట్ ప్రాక్టీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరిలో ఎవరితో తలపడడం కష్టమని ప్రశ్నించగా.. షమీ ఆసక్తికరమైన సరదా సమాధానం ఇచ్చాడు. నెట్స్‌లో తనను ఎదుర్కోవడానికి ఇద్దరూ ఇష్టపడరని చెప్పాడు. ఈ విషయాన్ని తాను చాలా ఇంటర్వ్యూలలో చెప్పానని అన్నాడు. విరాట్‌తో బంధం చాలా స్నేహపూర్వకంగా ఉంటుందని, అయితే ఒకరినొకరం సవాలు చేసుకుంటూ ఉంటామని షమీ చెప్పాడు. ‘‘ నా బౌలింగ్‌లో భిన్నమైన షాట్లు ఆడటానికి కోహ్లీ ప్రయత్నిస్తుంటాడు. కోహ్లీని ఔట్ చేయడానికి నేను అత్యుత్తమంగా ప్రయత్నిస్తాను. ఇద్దరి మధ్య స్నేహం మమ్మల్ని చక్కటి ఆటకు ప్రేరేపించేలా ఉంటుంది. మేము వంద శాతం ప్రదర్శన అందించేందుకు స్నేహం దోహదపడుతుంది’’ అని షమీ పేర్కొన్నాడు.

ఫీల్డింగ్ సరిగ్గా సెట్ చేసిన తర్వాత విరాట్‌ని బ్యాటింగ్ చేయమని అడుగుతానని వెల్లడించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తను బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎప్పుడూ అంగీకరించడని, ఆడబోనని వెంటనే చెప్పేస్తాడని గుర్తుచేసుకున్నాడు.

ఇక నెట్స్‌లో విరాట్ కోహ్లీని రెండు లేదా మూడు సార్లు ఔట్ చేశానని, ఔట్ అయినప్పుడు కోహ్లీ చిరాకుపడుతుంటాడని షమీ పంచుకున్నాడు. భారత క్రికెట్ జట్టులో ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తనకు మంచి మిత్రులని తెలిపాడు. ‘‘ ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్లతో కూడిన సన్నిహిత మిత్రులు ఉన్నారు. మేము ఒకరితో ఒకరం  ఫోన్‌లో మాట్లాడుకుంటుంటాము. అయితే రెగ్యులర్‌గా ఫోన్ చేసుకోబోం’’ అని షమీ వివరించాడు.

కాగా వన్డే వరల్డ్ కప్ 2023లో ‘స్వింగ్‌’ బౌలింగ్‌తో మహ్మద్ షమీ అదరగొట్టాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు సాధించాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. సత్తా నిరూపించుకొని మరోసారి జట్టులోకి రావాలని షమీ భావిస్తున్నాడు.


More Telugu News