హార్ధిక్ పాండ్యాకు కోచ్ గంభీర్ ఫోన్ కాల్.. సున్నితంగా స్ట్రాంగ్ మెసేజ్!

  • వన్డే జట్టులో చోటు దక్కాలంటే.. బౌలింగ్ కోటా పూర్తి చేయగలనని నిరూపించుకోవాలంటూ సూచన
  • విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని సూచించినట్టు కథనాలు
  • శ్రీలంక టూర్‌లో ఒక ఆటగాడిగా మాత్రమే పాండ్యాకు చోటు..
  • కనీసం వైస్ కెప్టెన్‌గానూ ఛాన్స్ ఇవ్వని సెలక్టర్లు
  • వన్డే జట్టుకు ఎంపిక చేయని వైనం
టీ20 వరల్డ్ కప్ 2024ను గెలిచిన భారత్ జట్టులో భాగమైనప్పటికీ స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పడుతున్నాడు. తన భార్య నటాసా స్టాంకోవిచ్‌‌‌కు విడాకులు ఇచ్చినట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించాడు. ఇక టీ20 వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యాను శ్రీలంక టూర్‌కు కేవలం జట్టులో ఒక ఆటగాడిగా మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. సూర్య కుమార్ యాదవ్‌కు టీ20 సిరీస్ కెప్టెన్సీని అప్పగించిన సెలక్టర్లు వైస్ కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్‌కు అవకాశం ఇచ్చారు. ఈ పరిణామం హార్ధిక్ పాండ్యాకు ఏమాత్రం రుచించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక వన్డే జట్టులో హార్ధిక్ పాండ్యాకు చోటు దక్కకపోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ ఆసక్తికరమైన కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. వన్డేల్లో పాండ్యా స్థానానికి గ్యారెంటీ లేదని ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం పేర్కొంది. కోచ్ గౌతమ్ గంభీర్ హార్ధిక్ పాండ్యాకు ఫోన్ చేసి తన బౌలింగ్ ఫిట్‌నెస్‌ని నిరూపించుకోవడానికి విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని సూచించినట్టు తెలుస్తోందని కథనం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారని పేర్కొంది. ‘‘హార్దిక్‌కి గంభీర్ ఫోన్ చేశారు. వన్డేలలో పాండ్యా పూర్తిస్థాయి బౌలింగ్ కోటాను పూర్తి చేయాలని గంభీర్ ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ఫోన్ సంభాషణలో చెప్పారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్టు ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం వివరించింది.

పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాల్సింది: మహ్మద్ కైఫ్ 

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. శ్రీలంక పర్యటనలో పాండ్యాకు టీ20 జట్టు కెప్టెన్సీ ఇవ్వాల్సిందని అన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రెండేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడని, తొలి సీజన్‌లోనే ఫైనల్‌ చేర్చి జట్టుని గెలిపించాడని కైఫ్ గుర్తుచేశాడు. హార్దిక్‌కు టీ20 కెప్టెన్‌గా అనుభవం ఉంది కాబట్టి అతడికి ఇచ్చి ఉండే బాగుండేదని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్‌లో వైస్కెప్టెన్‌గా వ్యవహరించాడని గుర్తుచేశాడు.


More Telugu News