ఎంత విపత్తు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు: నిమ్మల రామానాయుడు ఆదేశాలు

  • వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచాలన్న నిమ్మల
  • వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత భవనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశం
  • ఏటిగట్ల పటిష్ఠతకు ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచుకోవాలన్న మంత్రి
గత రెండు రోజులుగా ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఎంత విపత్తు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నామని తెలిపారు. అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని సూచించారు. వరద బాధితులకు బియ్యం, నిత్యావర సరుకులు, గ్యాస్ తదితరాలకు కొరత లేకుండా రెవెన్యూ అధికారులు చూసుకోవాలని చెప్పారు. 

తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో తుపాను రక్షిత భవనాలను సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చోట్ల బోట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. డయేరియా, విష జ్వరాలు, పాము కాటుకు సంబంధించిన మందులను రెడీగా ఉంచుకోవాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా వారిని మత్స్యశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఏటిగట్ల పటిష్ఠతకు ఇసుక బస్తాల వంటివాటిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.


More Telugu News