రాజకీయాలు, లీడర్‌షిప్‌లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్... ఆయన నుంచి నేర్చుకున్నా: కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలో రేవంత్ రెడ్డి

  • ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయన్న సీఎం  
  • ఎన్టీఆర్ ఎంతోమందికి అవకాశమిచ్చారన్న రేవంత్ రెడ్డి
  • చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని వ్యాఖ్య
  • హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
రాజకీయాలు, లీడర్‌షిప్‌లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని... తాను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన కూడా ఒక కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే ఈనాడు దేశాన్ని ఏలుతున్నాయన్నారు.

ఈ దేశంలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు అనుకున్న సమయంలో ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాలను తీసుకువచ్చారన్నారు. ఈ రోజు దేశాన్ని ఏలుతున్న వారికి అవకాశం ఇచ్చింది నాడు ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాల వల్లనే అన్నారు. నాడు టీడీపీ, జనతా పార్టీ సంకీర్ణం ఏర్పడిందన్నారు. ఆ రోజు జనతా పార్టీ గెలిచింది రెండే సీట్లు అని, ఒకటి గుజరాత్‌లో అయితే రెండోది ఎన్టీఆర్ మద్దతుతో హన్మకొండ అన్నారు. ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాల ఆలోచనతోనే ఇప్పుడు అధికారంలో ఉన్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు.

కమ్మవారితో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తాను పెద్దగా చెప్పాల్సిన పని లేదన్నారు. యరపతినేని మాటలు వింటే కమ్మవారు తనను ఎంతగా అభిమానిస్తారో తెలిసిపోతుందన్నారు. తాను ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్నానని... తాను ఉన్నతస్థానానికి రావడానికి అది ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేసుకున్నారు. అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. ఈ మాట అందరి ముందు చెప్పడానికి కూడా తాను సంకోచించడం లేదన్నారు. మనకు అవకాశం ఇచ్చిన వారిని... అవకాశం వచ్చిన నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదని సీఎం అన్నారు. 

ఎన్టీఆర్ బ్రాండ్ క్రియేట్ చేశారు

ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మవారు ఎమ్మెల్యేలుగా ఉండేవారని చెబుతున్నారని, కానీ ఎన్టీఆర్ వచ్చాక ఆయన ఒక బ్రాండ్ అయ్యారని తెలిపారు. ఆయన ఇచ్చిన అవకాశాలతో ఏపీ, తెలంగాణలలో ఎంతోమంది రాజకీయ నాయకులుగా ఎదిగారని, ఇప్పుడు అన్ని పార్టీలలోనూ ఆయన అవకాశం ఇచ్చిన వారు ఉన్నారని తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్‌ను విమర్శించేవారు... ప్రశంసించేవారు... అందరికీ ఆయనే అవకాశం ఇచ్చారన్నారు.

చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

ఎన్టీఆర్‌తో పాటు ఎన్జీరంగా, వెంకయ్యనాయుడు, ఈరోజు చంద్రబాబు గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. కమ్మ అంటే అమ్మలాంటి వాళ్లని ప్రశంసించారు. మట్టిని నమ్ముకొని పని చేసి పదిమందికి సాయం చేసే కులం కమ్మకులం అన్నారు. ఎక్కడైతే సారవంతమైన నేల ఉంటుందో... సమృద్ధిగా నీరు ఉంటుందో అక్కడ కమ్మవారు ఉంటారని చెప్పవచ్చునన్నారు. కమ్మవారు మట్టి నుంచి బంగారం తీయగలిగే శక్తి కలిగి ఉన్నారన్నారు. కమ్మలు వాళ్ల తాతలు... ముత్తాతల వలె పదిమందికి సాయం చేయాలని ఆయన సూచించారు. ఉన్న ఊరును, భూమిని మరిచిపోవద్దని సూచించారు. సహాయం చేయడం మీ డీఎన్ఏ అని, అది మీ సహజ లక్షణమని, దానిని మరిచిపోవద్దని సూచించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీతో అంతటా కమ్మవారు విస్తరించారన్నారు.

హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కమ్మవారి కృషిని ఎవరూ కాదనలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పైనా వివక్ష ఉండదని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రక్రియలో మీరూ భాగస్వాములు కావాలన్నారు.


More Telugu News