ఆంధ్రప్రదేశ్ ను జగన్ అరాచకప్రదేశ్ గా మార్చారు: భానుప్రకాశ్ రెడ్డి

  • ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ చెప్పడంపై భానుప్రకాశ్ రెడ్డి విమర్శలు
  • వైసీపీ హయాంలో జరిగిన దాడులపై మాట్లాడాలని డిమాండ్
  • విధ్వంసాలకు పాల్పడిన ఏ వైసీపీ నేతను వదలబోమని హెచ్చరిక
వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ను అరాచకప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. ప్రతిరోజు ప్రజలు, ప్రతిపక్షాలు, పత్రికలపై దాడి చేసిన ఘనత జగన్ దని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే తమపై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. విధ్వంసాలను పాల్పడిన ఏ ఒక్క వైసీపీ నేతను కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. 

ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులు, దారుణాలపై ధర్నాలో జగన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశంలోనే చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పారు.


More Telugu News