యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా

  • వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు అధికార వర్గాల వెల్లడి
  • పూజా ఖేడ్కర్ వివాదానికి, సోనీ రాజీనామాకు సంబంధం లేదంటున్న అధికారులు
  • మరో ఐదేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వివాదం వేళ ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆమె వివాదానికి, మనోజ్ సోనీ రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.

మనోజ్ సోనీ గత ఏడాది ఏప్రిల్ నెలలో బాధ్యతలు చేపట్టారు. ఇంకా అయిదేళ్ల పదవీ కాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిని ఇంకా ఆమోదించలేదు. 2017లో యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యుడిగా చేరిన ఆయన గత ఏడాది చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన పదవీకాలం 2029 మే 15 వరకు ఉంది. చైర్మన్ పదవిని చేపట్టేందుకు ఆయన ముందు నుంచీ సుముఖంగా లేరని, తనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని గతంలోనే ఓసారి అభ్యర్థించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. యూపీఎస్సీ చైర్మన్ కంటే ముందు ఆయన గుజరాత్‌లోని బాబా సాహెబ్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి రెండుసార్లు వీసీగా సేవలు అందించారు.


More Telugu News