దేశం కోసం వేలిని తొలగించుకున్న ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు

  • ఇటీవల కుడిచేతి వేలికి గాయం
  • శస్త్రచికిత్స చేసినా కోలుకునేందుకు చాలా సమయం
  • 26 నుంచి ఒలింపిక్స్ క్రీడలు
  • గాయమైన వేలి పైభాగాన్ని తొలగించుకుని క్రీడలకు రెడీ అయిన డిఫెండర్ మట్ డాసన్
గాయమైన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం, మరోవైపు, ఒలింపిక్స్ క్రీడలు సమీపిస్తుండడంతో ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు మట్ డాసన్ (30) కఠిన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

డిఫెండర్ అయిన డాసన్ కుడిచేతి ఉంగరపు వేలికి ఇటీవల పెద్ద గాయమైంది. శస్త్ర చికిత్స చేసుకున్నా కోలుకునేందుకు చాలా సమయం పట్టనుంది. అదే జరిగితే ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌కు దూరమవుతాడు. దీనిని జీర్ణించుకోలేకపోయిన డాసన్.. ఎలాగైనా దేశం తరపున ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా గాయమైన వేలి పైగాన్ని పూర్తిగా తొలగించుకుని దేశంపైనా, ఆటపైనా తనకున్న మక్కువను చాటుకున్నాడు.

వేలు తొలగించుకోవడానికి ముందు విషయాన్ని భార్యకు చెప్పానని, ఆమె వద్దని వారించిందని చెప్పాడు. అయినప్పటికీ నిర్ణయం మార్చుకోలేదని వివరించాడు. కాగా, ఆరేళ్ల క్రితం అతనికి హాకీ స్టిక్ తగలడంతో దాదాపు కంటిచూపు కోల్పేయేంత పని అయింది. అప్పుడు కూడా ధైర్యంగా ఉండి కంటి చూపును కాపాడుకోగలిగాడు. ఇప్పుడు మళ్లీ వేలిని తొలగించుకుని మరోమారు వార్తల్లోకి ఎక్కాడు.


More Telugu News