ఢిల్లీ వెళ్లి ఏపీలో రాష్ట్రపతి పాలన అడుగుతాం: జగన్

  • వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
  • అనంతరం ప్రెస్ మీట్
  • ఈ నెల 24న ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ చేపడతామని వెల్లడి
  • రాష్ట్రపతి, ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తానని వివరణ
రాష్ట్రంలో ప్రజలకు పథకాలు అమలు చేయని చంద్రబాబు, వీటన్నింటి నుంచి దృష్టి  మరల్చేందుకు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కార్యక్రమాలకు తెరలేపారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. చంద్రబాబు ఈ మాదిరిగా దాడులు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 

"కచ్చితంగా వీటిపై నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డుతగులుతాం. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గవర్నర్ ను నిలదీస్తూ, వైసీపీ గళం విప్పుతుంది. 

ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఢిల్లీ వెళ్లి బుధవారం (జులై 24) నాడు సింబాలిక్ ప్రొటెస్ట్ చేపడతారు. ఏపీలో జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి దేశమంతా తెలిసేలా ఈ నిరసన కార్యక్రమం ఉంటుంది. 

అందులో భాగంగానే, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ అడిగాం. అమిత్ షా, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా తీసుకుంటాం. వీళ్లందరినీ కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరిస్తాం. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళతాం" అని జగన్ స్పష్టం చేశారు.


More Telugu News