ఈ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

  • అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వెల్లడి
  • జగిత్యాల, నిర్మల్ తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారినట్లు తెలిపింది. ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

రేపు ఉదయం వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతోందని తెలిపింది. ఈ క్రమంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కామారెడ్డి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, కుమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కూడా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.


More Telugu News