మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవల్లో అంతరాయం

  • విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య.. 
  • భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలో పలు సేవలకు బ్రేక్
  • సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడి
  • స్టాక్ మార్కెట్ పైనా ప్రభావం
మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆన్ లైన్ సేవలతో పాటు టికెట్ బుకింగ్, చెక్ ఇన్ లపైనా ప్రభావం పడింది. దీంతో పలు విమానాలు రద్దవగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లపైనా పడిందని, ఆయా మార్కెట్లు డౌన్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

ఏం జరిగిందంటే..
విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా యూజర్లకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్‌, పీసీ స్క్రీన్‌లపై ఈ ఎర్రర్‌ కనిపించి, ఆపై సిస్టమ్‌ షట్‌డౌన్‌ గానీ, రీస్టార్ట్ గానీ అవుతోందని సోషల్ మీడియాలో యూజర్లు పోస్టులు పెడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి అప్ లోడ్ చేస్తున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు తమ టెక్నికల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌, సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసింది.

ముంబై ఎయిర్ పోర్టులో..
ముంబైలోని చెక్-ఇన్ సేవలపై మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్ కనిపించింది. దీంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండిగో, అకాసా, స్పైస్‌జెట్ సంస్థలు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి. దేశవ్యాప్తంగా విమానాలపై ప్రభావం పడిందని ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి. విదేశాల్లోనూ విమాన సేవలు ఆలస్యం, పూర్తిగా రద్దవడం జరుగుతోంది. అమెరికాలో ఫ్రంటీయర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేసింది.

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడంటే..
డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కంపెనీల్లో చెకిన్‌, బుకింగ్‌ సహా పలు సేవలలో అంతరాయం
లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సేవల్లో అంతరాయం, నిలిచిన మెట్రో సర్వీసులు 
అమెరికా ఫెడరల్ ఏవియేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌ కార్యకలాపాలకు అంతరాయం
అత్యవసర సర్వీస్ 911 సేవలకూ ఇబ్బందులు
ఆస్ట్రేలియాలో వార్తాసంస్థల ప్రసారాలు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులలో కార్డుల వినియోగంలో సమస్యలు


More Telugu News