గత ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదు.. రషీద్ హత్యపై ఏపీ మంత్రి ఫరూక్

  • బాధితుడు, నిందితుడు ఇద్దరూ వైసీపీలో కలిసి తిరిగారన్న మంత్రి
  • రెండేళ్ల క్రితమే ఇద్దరికీ గొడవ జరిగిందని గుర్తు చేసిన ఫరూక్
  • ఈ విషయంలో  ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిక
పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమేనని ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ విమర్శించారు. నిందితుడికి, బాధితుడికి మధ్య జరిగిన గొడవను మొదట్లోనే అణచివేసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని అన్నారు. చనిపోయిన రషీద్, నిందితుడు జిలానీ ఇద్దరూ గతంలో వైసీపీలో కలిసి తిరిగారని, రెండేళ్ల క్రితం మొహర్రం సందర్భంగా తాగి కొట్టుకున్నారని వివరించారు. తర్వాత వారంతా జిలానీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టి ద్విచక్ర వాహనం తగలబెట్టినప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్నారు.

ఇలాంటి ఘటనే ఎన్నికలకు ఆరునెలల ముందు నంద్యాలలో జరిగిందని, అక్కడ పట్టపగలు హత్య జరుగుతుంటే అందరూ చూస్తూ ఊరుకున్నారని, ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని గుర్తుచేశారు. ఎన్నికలకుముందు జిలానీ టీడీపీలోకి వచ్చినంత మాత్రాన హత్యను పార్టీకి అంటగట్టడం, ముఖ్యమంత్రే ఇందుకు బాధ్యత వహించాలని అనడం సరికాదన్నారు. శిక్షించే విషయంలో పార్టీలు చూడబోమని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఫరూక్ హెచ్చరించారు.


More Telugu News