దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అవకతవకలపై ఉన్నతాధికారుల నివేదిక

  • గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై అధికారుల దృష్టి
  • లీజుల కేటాయింపు, పాలకమండలి వ్యవహారాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని గుర్తింపు
  • అవకతవకలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ అధికారుల నివేదిక
దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్‌ కె. శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకూ ఆమె సహాయకమిషనర్‌గా పని చేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. 

  • నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు., ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
  • విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులో సిద్దేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినవారికి కట్టబెట్టారు. 
  • సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతడి మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది. 
  • లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తరువాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. 
  • నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.
  • గతంలో అశీల్‌మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదనే ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత జరిపిన విచారణలో ఇది నిజమని తేల్చారు.


More Telugu News