పిల్లల అల్లరి మాన్పించే ప్రయత్నం.. పొరపాటున ఉరి బిగుసుకుని తండ్రి కన్నుమూత

  • కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి ఆగ్రహం 
  • అడ్డుపడ్డ భార్యతో స్వల్పంగా వివాదం
  • తనను విసిగిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ మెడకు ఉరి తగిలించుకుని బెదిరింపు
  • పొరపాటున ఉరి బిగుసుకోవడంతో దుర్మరణం
  • విశాఖలో వెలుగు చూసిన ఘటన
తన పిల్లల అల్లరి మాన్పించేందుకు ఓ తండ్రి చేసిన ప్రయత్నం దారుణంగా వికటించింది. అతడి మెడకు ఉన్న ఉరి పొరపాటున బిగుసుకోవడంతో కన్నుమూశాడు. విశాఖలో తాజాగా ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గోపాలపట్నం పోలీసుల కథనం ప్రకారం, బీహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్. ఐదేళ్ల నుంచి 89వ వార్డు కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. బుధవారం రాత్రి కుమార్తె (7), కుమారుడు (5) ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. పిల్లలపై చిరాకు పడుతున్న చందన్‌ కుమార్‌కు భార్య అడ్డుపడింది. 

ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవైంది. తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ కుమార్ బెదిరించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో, ఆయన ఇంట్లోని ఫ్యాన్‌హుక్‌కు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబసభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక గిలగిల్లాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.


More Telugu News