ప్రకటనలే తప్ప చర్యలేవి హోంమంత్రి గారూ?: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

  • ఏపీలో ఇటీవల కొన్ని అత్యాచార ఘటనలు
  • దిశా చట్టం, యాప్ ను నిర్వీర్యం చేయడం వల్లే ఈ ఘటనలు అంటూ కల్యాణి ఫైర్
  • ఇకనైనా దిశా చట్టం, యాప్ ను యాక్టివేట్ చేయాలని స్పష్టీకరణ
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అని ప్రకటించారని, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని స్టేట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు. ఇలా స్టేట్ మెంట్లు ఇవ్వడమే తప్ప, చర్యలేవి హోంమంత్రి గారూ? అని కల్యాణి ప్రశ్నించారు. 

"నిజంగా మీరు చేసిన స్టేట్ మెంట్లన్నీ అమలు చేస్తే మరుసటి రోజు నుంచే ఇలాంటి దుర్మార్గాలన్నీ జరగవు కదా. ఇలాంటి దారుణాలు జరగకూడదనే ఆ రోజు జగన్ దిశా చట్టం, దిశా యాప్ తీసుకువచ్చారు. 1.30 కోట్ల మంది మహిళలు తమ ఫోన్లలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. కేంద్రంలో దిశా చట్టం పెండింగ్ లో ఉన్నప్పటికీ, అందులో ఉన్న అంశాలను మన రాష్ట్రంలో అమలు చేశారు. 

18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఫాస్ట్  ట్రాక్ కోర్టులు తీసుకువచ్చారు. దిశా వ్యవస్థ కోసం 3 వేల వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. 2,800 మంది మహిళలను, ఆడపిల్లలను దిశా యాప్ ద్వారా రక్షించడం జరిగింది. 

పొరుగు రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనతో, ఏపీలో అలాంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో దిశా చట్టం, దిశా యాప్ ను జగన్ తీసుకువచ్చారు. ఇలాంటి మంచి చట్టాన్ని, మంచి యాప్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడంలేదు. దిశా చట్టం లేదు, దిశా యాప్ లేదు అంటూ హోంమంత్రి, వారి పార్టీ నేతలు మాట్లాడుతుండడంతో దుర్మార్గుల్లో భయం లేకుండా పోయింది. 

దిశా అనేది ఒక ఆయుధం. దీన్ని నిర్వీర్యం చేస్తే దుర్మార్గులు పేట్రేగిపోరా? ఒక ఆయుధాన్ని తయారుచేసిన వాడి మీద కోపంతో, ఆ ఆయుధాన్ని వాడకపోతే కచ్చితంగా దుష్టులు, దుర్మార్గులు విజృంభిస్తారు. మా జగనన్న మీద కోపంతో, ఆయన తీసుకువచ్చిన దిశ వంటి మంచి వ్యవస్థను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? 

చెడ్డవారిని చీల్చిచెండాడే ఆయుధం వంటి దిశాను మళ్లీ యాక్టివేట్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ చట్టం కేంద్రం వద్ద  పెండింగ్ లో ఉంది. మీరు ఎలాగూ కేంద్రంలో ఉన్నారు కాబట్టి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దిశా చట్టం అమల్లోకి వచ్చేలా చేయండి" అంటూ వరుదు కల్యాణి స్పష్టం చేశారు.


More Telugu News