యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలపై స్పందించిన అఖిలేశ్ యాదవ్

  • యోగి, కేశవ్ ప్రసాద్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం
  • బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతోందన్న అఖిలేశ్
  • అంతర్గత కుమ్ములాటలతో కీచులాడుకుంటున్నారని విమర్శ
  • ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని మండిపాటు
ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు ఉన్నట్లుగా జరుగుతోన్న ప్రచారంపై మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతోందన్నారు. బీజేపీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో కీచులాడుకుంటున్నారని విమర్శించారు.

కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందన్నారు. రాష్ట్ర రాజధాని లక్నోలో గృహాల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారని, యోగి ప్రభుత్వం బలహీనపడుతోందనడానికి ఇది సంకేతమన్నారు. 

మరోపక్క, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సగం సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు వచ్చాయి.


More Telugu News