ముగిసిన గడువు.. నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆ మూడు స్టేషన్లలో ఇక ఆగవు

  • కరోనా కారణంతో మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్లలో స్టాపుల ఎత్తివేత
  • ప్రయాణికుల ఆందోళన, ఉత్తమ్‌కుమార్ చొరవతో ఏడాది క్రితం పునరుద్ధరణ
  • అప్పట్లో ఏడాదిపాటు మాత్రమే రైళ్లు ఆపేలా ఆదేశాలు
  • ఈ నెల 19తో ముగియనున్న గడువు.. రిజర్వేషన్ల నిలిపివేత
నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎల్లుండి నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఆగకుండానే వెళ్లనున్నాయి. ఈ మూడు స్టాప్‌లను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభణకు ముందు ఈ మూడు స్టేషన్లలో రైళ్లు ఆగేవి. అయితే కరోనా నేపథ్యంలో రైల్వే శాఖ ఈ స్టాపులను ఎత్తివేసింది. దీంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో..
స్టాపుల ఎత్తివేతతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పటి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైల్వే బోర్డు అధికారులను కలిసి విన్నవించడంతో ఏడాది క్రితం మళ్లీ ఆయా రైళ్లకు స్టాపులు ఏర్పాటు చేశారు. ఏడాది పాటు మాత్రమే అక్కడ రైళ్లను ఆపాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ గడువు ఈ నెల 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ మూడు రైళ్లు ఇక్కడ ఆగకుండానే వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో రిజర్వేషన్లను నిలిపివేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు నల్గొండ స్టాప్‌ను కూడా ఎత్తివేశారు.


More Telugu News