రేపటి నుంచి తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు.. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ

  • పరీక్షల వాయిదా కోరుతూ విద్యార్థుల నిరసనలు
  • షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు
  • జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ జరగనున్న పరీక్షలు
తెలంగాణలో గురువారం నుంచి డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపింది. టెట్ నిర్వహణ, డీఎస్సీ ప్రిపరేషన్ కోసం మరికొంత సమయం కావాలంటూ అభ్యర్థులు పరీక్షల వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. అయితే, ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం, పరీక్ష నిర్వహించేందుకు రెడీ అయ్యింది. 

ఇక పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. హాల్ టిక్కెట్లలో తప్పులు దొర్లాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థులు రావడంతో వాటిని సరి చేసి ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. 


More Telugu News