తెలంగాణలో నేటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు!

  • తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ 
  • 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం
  • నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ శాఖ
తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం భారీగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని పేర్కొంది. 

గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. 

శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 

శనివారం ఆదిలాబాద్, కుమురం భీమం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. 

ఇక రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కుంచవెల్లిలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.


More Telugu News