సుప్రీంకోర్టులో కేసీఆర్ కు ఎదురుదెబ్బ

  • విద్యుత్ ఒప్పందాలపై వేసిన కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్
  • కమిషన్ విచారణ కొనసాగించాలన్న సుప్రీంకోర్టు
  • కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసిహారెడ్డి ఛైర్మన్ గా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. 

కేసీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం కేసీఆర్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అనకుండా... ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని తెలిపింది.

మరోవైపు, కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, కమిషన్ ఛైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ఛైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని... సోమవారం కొత్త ఛైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది.


More Telugu News