సొంత పార్టీలోనే ఇబ్బంది పడ్డా.. జగన్ ను కూడా ప్రశ్నించా: బాలినేని శ్రీనివాస్

  • బయటి వారితో కలిసి వైసీపీకి చెందిన కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న బాలినేని
  • తన కొడుకుతో తిరిగే వాళ్లను గంజాయి బ్యాచ్ అంటున్నారని మండిపాటు
  • 1973లోనే తమకు సొంత కారు ఉందని వ్యాఖ్య
వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సొంత పార్టీలోనే ఇబ్బందులు పడ్డానని చెప్పారు. వైసీపీకి చెందిన కొందరు బయటి వారితో కలిసి తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తాను అన్నింటినీ ఓర్చుకున్నానని చెప్పారు. తాను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... తనపై వస్తున్న అన్ని ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను కోరుతున్నానన్నారు. 

రాష్ట్ర మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాలినేని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు. తన కొడుకుతో తిరిగే వాళ్లను గంజాయి బ్యాచ్ అంటున్నారని మండిపడ్డారు. 

ప్రశ్నించడం తన నైజమని... జగన్ కరెక్ట్ గా చేయనప్పుడు కూడా తాను ప్రశ్నించానని బాలినేని అన్నారు. దీనివల్ల తాను ఇబ్బందులు కూడా పడ్డానని చెప్పారు. 1973లోనే తమకు సొంత కారు ఉందని... అలాంటి తమను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాఫ్ట్ గా ఉండే తనను కొందరు ఇరిటేట్ చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News