చెవికి బ్యాండేజ్ తో పార్టీ కార్యక్రమానికి హాజరైన ట్రంప్

  • రెండు రోజుల క్రితం పెన్సిల్వేనియా సభలో ట్రంప్ పై కాల్పులు
  • త్రుటిలో మృత్యువు నుంచి బయటపడ్డ ట్రంప్
  • పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ కు ఘన స్వాగతం
రెండు రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక యువకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమయింది. రెప్పపాటులో ట్రంప్ మృత్యువు నుంచి బయటపడ్డారు. 

మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, నిన్న రాత్రి జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ట్రంప్ ను ఆడిటోరియంలోని స్క్రీన్ పై చూడగానే సభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు. ట్రంప్ పేరుతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ట్రంప్ ఆడిటోరియంలోకి ప్రవేశించిన వెంటనే... 'గాడ్ బ్లెస్ ది యూఎస్ఏ' అనే పాటను గాయకుడు లీ గ్రీన్ వుడ్ ఆలపించారు. పాటను వింటూ ట్రంప్ చిరునవ్వులు చిందించారు. ఈ సమావేశానికి ట్రంప్ చెవికి బ్యాండేజ్ వేసుకుని వచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంకోవైపు, పెన్సిల్వేనియా సభలో తనపై కాల్పుల ఘటన జరిగిన తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ... కాల్పులు ఘటనలో తాను చనిపోవాల్సిన వాడినేనని అన్నారు. ఇలా మీ ముందు ఉండేవాడిని కాదని చెప్పారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.


More Telugu News