ఆ బాలుడి తోక తొలగించిన బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు

  • గతేడాది అక్టోబరులో హైదరాబాద్ జంటకు బాలుడి జననం
  • మూడు నెలల్లో 15 సెంటీమీటర్లు పెరిగిన తోక
  • వెన్నుపూసతో అనుసంధానమైనట్టు గుర్తింపు
  • అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా తొలగింపు
గతేడాది ఓ బాలుడు తోకతో జన్మించగా, ఆ తర్వాత అది మరింత పెరిగింది. దీంతో వైద్యులు తాజాగా ఆ చిన్నారి తోకను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో గతేడాది అక్టోబరులో ఓ మహిళకు జన్మించిన బాలుడికి తోక ఉండడం తల్లిదండ్రులు గుర్తించారు. మూడు నెలలు గడిచేసరికి అది 15 సెంటీమీటర్లు పెరిగింది. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు జనవరిలో బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.

పరీక్షించిన చిన్న పిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్‌పండా.. వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్టు గుర్తించారు. తాజాగా ఆపరేషన్ ద్వారా విజయవంతంగా దానిని తొలగించారు. 

అనంతరం డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ తోక నాడీ వ్యవస్థతో ముడిపడి ఉండడంతో ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారిందని తెలిపారు. ఇలాంటి శస్త్రచికిత్సల అనంతరం నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. అయితే, ఈ చిన్నారిలో మాత్రం ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు.


More Telugu News