జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన ట్రంప్.. ఒక్కసారిగా వార్తల్లోకి ఉష చిలుకూరి!

  • తెలుగమ్మాయి ఉష చిలుకూరి భర్త జేడీ వాన్స్‌ 
  • కాలిఫోర్నియాలో జన్మించి... లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్‌గా పని చేసిన ఉష
  • భర్త జేడీ వాన్స్‌కు రాజకీయాల్లో తోడుగా ఉన్న ఉష
  • భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడంలో సహకారం ఉంటుందని ఆశాభావం
అమెరికాలో తెలుగుంటి అమ్మాయి ఉష చిలుకూరి ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా, వైస్ ప్రెసిడెంట్ బరిలో జేడీ వాన్స్ ఉన్నారు. జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి వాన్స్. జేడీ వాన్స్ ఓహియో రిపబ్లికన్ సెనేటర్. మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో ట్రంప్... జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు.

ఉష చిలుకూరి వాన్స్ నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్‌గా పని చేస్తూ ఎన్నో కేసుల్ని పరిష్కరించారు. ఆమె యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్ర పాఠ్యాంశంగా బ్యాచిలర్ డిగ్రీని, కేంబ్రిడ్జ్ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్‌ల వద్ద ఆమె పని చేశారు. న్యాయశాస్త్ర రంగంలో విశిష్ట అనుభవాన్ని గఢించారు. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉష కాలిఫోర్నియాలో జన్మించారు.

ఉష చిలుకూరి యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీ మేనేజింగ్ ఎడిటర్, ది యేల్ లా జర్నల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా సేవలు అందించారు. 2014లో ఆమె డెమోక్రాట్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

భర్తకు రాజకీయాల్లో చేదోడుగా...

ఉష, జేడీ వాన్స్ యేల్ లా స్కూల్‌లో కలుసుకున్నారు. 2014లో కెంటకీలో పెళ్లి జరిగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం వారి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ విజయంలో ఉష పాత్ర ఎంతో ఉంది. భర్త తరుచూ రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేలా ప్రోత్సహించేవారు. ఆయనతో కలిసి వెళ్లేవారు. భర్త తీసుకునే రాజకీయ నిర్ణయాలకు మద్దతు ప్రకటించేవారు. సూచనలు చేసేవారు. జేడీ వాన్స్ 2016లో ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఉష విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ తమ పార్టీ ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించారు.

భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడంలో సహకారం

అమెరికాకు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూయర్ ఒకరు ఏఎన్ఐతో మాట్లాడుతూ... ఉష వాన్స్ అత్యంత నిష్ణాతురాలైన న్యాయవాది అని తెలిపారు. ఆమెకు భారతదేశం గురించి, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసునన్నారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆమె తన భర్తకు సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉష, వాన్స్ భిన్నమైన విశ్వాసాలు కలిగిన వ్యక్తులని అన్నారు.

  మంచి తల్లిదండ్రులు.. మంచి భర్త!  

ఆయన (జేడీ వాన్స్) ఎంత కష్టపడుతున్నాడో... ప్రజల కోసం ఎంతగా ఆలోచిస్తారో ప్రజలు అర్థం చేసుకుంటారని ఉష అభిప్రాయపడ్డారు. ఆయన ఎప్పుడూ మెరుగ్గా పని చేయడానికే ప్రయత్నిస్తాడన్నారు. తాను హిందూ కుటుంబంలో పుట్టానని... తన తల్లిదండ్రులను ఆ విశ్వాసం మంచి తల్లిదండ్రులుగా చేసిందన్నారు. జేడీ వాన్స్ కూడా ఏదో చేయాలనే తపనతో ఉన్నట్లుగా తనకు అనిపించిందని, అతని దారి సరైనది అనిపించిందని, అందుకే అండగా నిలబడ్డానన్నారు.

జేడీ వాన్స్ ఓహియోలోని మిడిల్‌టన్‌లో జన్మించారు. కఠినమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగాడు. వాన్స్ తండ్రి చిన్నప్పుడే వారిని వదిలి వెళ్లిపోయాడు. తల్లి మాదకద్రవ్యాల అలవాటుతో పోరాడింది. దీంతో జేడీ వాన్స్ తాతయ్య వద్ద పెరిగాడు.


More Telugu News