అంబానీ కొడుకు పెళ్లికి వెళ్లినప్పుడు మన స్ట్రయిక్ రేట్ గురించి అడిగారు: పవన్ కల్యాణ్

  • దేశమంతా మన 100 శాతం స్ట్రయిక్ రేటు గురించి మాట్లాడుతోందన్న పవన్ కల్యాణ్
  • మన గెలుపు కేస్ స్టడీగా మారిందని వ్యాఖ్య
  • పరాజయాలను తట్టుకొని నిలబడ్డామన్న జనసేన అధినేత
సార్వత్రిక ఎన్నికల్లో మనం 100 శాతం స్ట్రయిక్ రేటు సాధించామని... దీనిపై దేశమంతా చర్చ సాగుతోందని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం అమరావతిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన తరఫున గెలిచిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ... జాతీయస్థాయిలో ఎక్కడకు వెళ్లినా తనకు మంచి గౌరవం ఇస్తున్నారని... ఇందుకు మన విజయమే దోహదపడిందన్నారు.

ముఖేశ్‌ అంబానీ తనయుడి వివాహానికి ముంబై వెళ్లిన సమయంలోనూ అక్కడి అతిథులు జనసేన 100 శాతం స్లయిక్‌ రేట్‌ను ప్రస్తావించి.. ఇదెలా సాధ్యమని అడగడం గొప్పగా అనిపించిందన్నారు. గెలిచిన వారికి కూడా మంచి మెజార్టీ వచ్చిందని, ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకం అన్నారు. మన బలం 7 శాతం నుంచి 20 శాతానికి పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు.

మన గెలుపు కేస్ స్టడీగా మారింది

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన ప్రతిచోటా గెలవడంపై దేశమంతా చర్చ సాగుతోందన్నారు. మనం తీసుకున్న సీట్లు తక్కువే అయినా... కూటమి గెలుపుకు మన 21 సీట్లు వెన్నెముకగా నిలిచాయన్నారు. ఈ గెలుపు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేసింద్నారు. దేశ రాజకీయ చరిత్రలో రాజకీయ నిపుణులకు, రాజనీతి శాస్త్ర విభాగంలో ఒక కేస్‌ స్టడీగా మారిందన్నారు.

పరాజయాలను తట్టుకుని నిలబడ్డాం

ఇన్నేళ్లుగా పరాజయాలను తట్టుకుని నిలబడ్డామని... మరొకరైతే పార్టీని వదిలి వెళ్లేవారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంత దూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదన్నారు.

తాను లేకపోతే పార్టీ లేదనుకునే తత్వం వీడాలని సూచించారు. ఎవరు లేకున్నా జనసేన ప్రయాణం ఆగిపోదని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలం చాలా గొప్పదని... మనకంటే గొప్పవారు ఎవరూ లేరనుకున్న వారిని 11 సీట్లకు పరిమితం చేసిందన్నారు. క్రమశిక్షణరాహిత్యంతో తనకు లేనిపోని తలనొప్పులు తీసుకురావొద్దని సూచించారు.

పదవి ఉన్నా లేకున్నా చివరి వరకు ప్రజల కోసమే పని చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినట్లు చెప్పారు. ఈ ప్రయాణంలో మొన్నటి వరకు మనకు అధికారం తెలియదని... ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలను తీసుకున్నామని పేర్కొన్నారు.

రాక్షస పాలనను అంతం చేయడానికి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశారన్నారు. ఓటు పోరాటం చాలా గొప్పదని... ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వారి స్ఫూర్తి ఫరిడవిల్లేలా మనం పని చేద్దామన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని... సమష్టిగా ముందుకు సాగుదామన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలు భయం గుప్పిట్లో బతికారని... రోడ్డు మీదకు రావాలంటే భయపడేవారన్నారు. మన అభిప్రాయం తెలియజేయాలన్నా భయపడే పరిస్థితులు అప్పుడు ఉండేవన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు పాల్పడేవారన్నారు. ఎంపీని కూడా చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 54 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో వారి దాష్టీకాలను బలంగా ఎదుర్కొంది జనసేన మాత్రమే అన్నారు.


More Telugu News