ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశాలు
  • కేంద్రం నుంచి నిధులు నిలిచిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచన
  • ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై నివేదిక తయారు చేయాలన్న ముఖ్యమంత్రి
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు నిలిచిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు.

ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై నివేదిక తయారు చేస్తే అసెంబ్లీ సమావేశాలకు ముందు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం... రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందని అధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. కేంద్రం 2011లో కులగణన చేసిందని, అప్పుడు 53 కాలమ్స్‌తో ఈ గణన చేసిందని, దానికి మరో మూడు జోడిస్తే అయిదున్నర నెలల సమయం పట్టవచ్చునని అధికారులు సీఎంకు చెప్పారు.

రిజర్వేషన్ల పెంపుపై సాధ్యాసాధ్యాలను పలువురు సీనియర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు వివాదాలను ముఖ్యమంత్రికి మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు.


More Telugu News