రుణమాఫీ మార్గదర్శకాలపై హరీశ్ రావు ఆగ్రహం

  • ఎన్నికల సమయంలో మభ్యపెట్టి... ఇప్పుడు వడపోతలపై దృష్టి పెట్టారని విమర్శ
  • రుణమాఫీకి విధించిన గడువు కూడా అసమంజసంగా ఉందన్న మాజీ మంత్రి
  • రుణభారం తగ్గించే ప్రయత్నం కంటే ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ అని ఆగ్రహం
రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక వడపోతలపై దృష్టి పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు సరికాదన్నారు. రేషన్ కార్డు నిబంధన అంటే లక్షలాదిమంది రైతుల ఆశలపై నీళ్లు జల్లడమే అన్నారు. రుణమాఫీకి విధించిన గడువు కూడా అసమంజసంగా ఉందన్నారు. డిసెంబర్ 12, 2018కి ముందు రుణమాఫీ వర్తించదనడం సరికాదన్నారు.

రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విష‌యం స్ప‌ష్టంగా అర్థమవుతోందన్నారు. పంట‌ల రుణ‌మాఫీ విష‌యంలో ఎన్నికల సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.

రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కంటే ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనబడుతోందన్నారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలు నీరుగారినట్లే అన్నారు. ఎన్నికలప్పుడు మభ్యపెట్టి... అధికారం చేజిక్కించుకున్నాక ఆంక్షలు పెట్టడమేమిటన్నారు.


More Telugu News