ఇన్‌స్టా రీల్ వివాదం.. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ ఆడడంతో ఒళ్లంతా హూనమైందని అర్థం వచ్చేలా ఇన్‌స్టా రీల్ చేసిన మాజీలు
  • వికలాంగులను అవమానించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్‌సీపీఈడీపీ
వికలాంగులను అవహేళన చేసేలా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేశారంటూ భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఇటీవల ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. 

అయితే 15 రోజులపాటు కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో తమ ఒళ్లంతా హూనమైందని, ఒళ్లంతా ఒకటే నొప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో కుంటుతూ, కాళ్లూ, చేతులు వంకర తిప్పుతూ, నడుము పట్టుకొని ఈ మాజీ ఆటగాళ్లు నడిచారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దివ్యాంగులను ఎగతాళి చేశారంటూ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మాజీ క్రికెటర్లతో పాటు నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్‌ను పోస్ట్ చేసేందుకు అనుమతించారంటూ మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా దేవనాథన్‌ పేరుని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. నలుగురు మాజీ క్రికెటర్లపై ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ చేస్తామని స్టేషన్ అధికారి వెల్లడించారు. ఈ వీడియో ఏమాత్రం బాలేదని, వికలాంగులకు పూర్తిగా అవమానించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.

ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు: హర్భజన్
ఈ వివాదంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ఇటీవల సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది తమ ఉద్దేశ్యం కాదని, ఈ మేరకు ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులను సందేహాలను నివృత్తి చేయదలుచుకున్నానని తెలిపాడు. ప్రతి వ్యక్తిని, సమాజాన్ని తాము గౌరవిస్తామని, 15 రోజుల పాటు నిరంతరాయంగా క్రికెట్ ఆడడం వల్ల శరీరాలు అలసిపోయానని ప్రతిబింబించడమే వీడియో ఉద్దేశమని చెప్పాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చాడు.


More Telugu News