పాక్‌‌ పర్యటనకు మీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టుగా రాసివ్వండి.. బీసీసీఐకి పీసీబీ డిమాండ్!

  • ఏ విషయమైనా త్వరగా తేల్చి చెప్పాలంటున్న పాక్ క్రికెట్ బోర్డు
  • భారత ప్రభుత్వం తిరస్కరిస్తే ఈ విషయాన్ని లేఖ ద్వారా ఐసీసీకి తెలపాలంటున్న పీసీబీ వర్గాలు
  • తటస్థ వేదికపై ఆడే అవకాశం కల్పించాలని ఇప్పటికే ఐసీసీని కోరిన భారత్
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు భారత్ జట్టు ఆతిథ్య దేశం పాకిస్థాన్‌కు వెళ్తుందా? లేదా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భారత ప్రభుత్వం అనుమతించబోదని, తటస్థ వేదికపై ఆడేందుకు అవకాశం కల్పించాలంటూ ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రతిపాదించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. 

ఈ పరిణామంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు ఆసక్తికరంగా స్పందించాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడికి (పాకిస్థాన్) భారత జట్టును పంపించకూడదనుకుంటే.. భారత ప్రభుత్వం అనుమతిని నిరాకరించినట్టుగా రాతపూర్వక రుజువును అందించాలని బీసీసీఐని పీసీబీ కోరుతోందని పాక్ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి-మార్చిలో టోర్నమెంట్ జరగాల్సి ఉన్నందున ఏ విషయం వీలైనంత త్వరగా తేల్చిచెప్పాలని కోరుతున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. 

కాగా జులై 19న శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఐసీసీ వార్షిక సమావేశం జరగనుంది. అయితే ఐసీసీ అజెండాలో ‘హైబ్రిడ్ మోడల్’లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై చర్చ అంశం లేకపోవడం గమనార్హం. తటస్థ వేదికగా యూఏఈలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నిర్వహించడంపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదు. కాగా తటస్థ వేదికలపై ఆడితే ఆ మ్యాచ్‌ల నిర్వహణకు ఐసీసీ అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

పాకిస్థాన్ వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతి తిరస్కరిస్తే.. ఆ విషయాన్ని రాతపూర్వకంగా లేఖను ఐసీసీకి బీసీసీఐ తప్పనిసరిగా తెలియజేయాలని పీసీబీ కోరుతోందని, ఆర్గనైజింగ్ కమిటీ వ్యవహారాలపై అవగాహనతో ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని చెప్పారని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. టోర్నీ ఆరంభానికి కనీసం 5-6 నెలల ముందు భారత జట్టు ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలను అందజేయాలని కోరుతోందని పేర్కొంది.

పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ చెబుతోంది. గతేడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన 2023 వన్డే ఆసియా కప్‌ సమయంలో కూడా అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో 'హైబ్రిడ్ మోడల్'లో భారత మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించిన విషయం తెలిసిందే.


More Telugu News