ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల రేట్లు పెంపు

  • మూడు నిర్దిష్ట డేటా ప్యాక్‌లను పెంచిన ఎయిర్‌టెల్
  • రోజుకు 1జీబీ డేటా అందించే ప్యాక్ ధర రూ.181 నుంచి 211కి పెంపు
  • 50జీబీ డేటా అందించే రూ.301 డేటా ప్యాక్ ఏకంగా రూ.361కి పెరుగుదల
దేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలే రీఛార్జ్ ప్లాన్ల ధరలను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. యూజర్లపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతూ మూడు డేటా ప్యాక్‌ల ధరలను కూడా ఎయిర్‌టెల్ పెంచింది. రూ.79, రూ.181, రూ. 301 డేటా ప్యాక్‌ల ధరలు పెరిగాయి. గతంలో రూ.181గా ఉన్న డేటా ప్లాన్ రూ. 30 పెరిగి ఇప్పుడు రూ.211కి చేరింది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా వస్తుంది. రెగ్యులర్ ప్లాన్‌తో పాటు అదనంగా 1జీబీ డేటా అవసరమైన యూజర్లు ఈ ప్లాన్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు.

301 డేటా ప్లాన్ ఇప్పుడు రూ.361
బేస్ ప్లాన్‌ వ్యాలిడిటీ ఉన్నంత కాలం అదనంగా 50జీబీ డేటా అందించే రూ.301 డేటా ప్యాక్ ఇప్పుడు రూ.361కి పెరిగింది. ఈ ప్లాన్‌ ఏకంగా రూ.60 మేర పెరిగింది. దీర్ఘకాలిక ప్లాన్‌లు వాడే యూజర్లు తమ డేటా అవసరాల మేరకు ఈ ప్లాన్‌ను ఉపయోగిస్తుంటారు.

రూ.79 ప్లాన్ రూ.99కి పెంపు
ఒక రోజు వ్యాలిడిటీతో 20జీబీ డేటా అందించే రూ.79 డేటా ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ రూ.99కి పెంచింది. ఈ ప్లాన్ రేటు రూ.20 మేర పెరిగింది. ఒకేరోజు ఎక్కువ డేటా అవసరమైన యూజర్లు ఈ ప్యాక్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. పెరిగిన డేటా ప్యాక్‌ల ధరలు డేటాను ఎక్కువగా ఉపయోగించేవారిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కాగా ఇటీవల ఎయిర్‌టెల్‌తో పాటు జియో, వీ(Vi) కూడా రీఛార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.


More Telugu News