బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే వివేకానంద

  • కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్న వివేకానంద
  • కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసింది తానేనని వ్యాఖ్య
  • హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శ
తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన మీద నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ రాని మెజార్టీ తనకే వచ్చిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని... ఇకపై కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసింది తానేనని గుర్తు చేశారు. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు కచ్చితంగా పడుతుందని చెప్పారు. 

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టిందని వివేకానంద విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. హైడ్రాతో శివారు మున్సిపాలిటీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వివేకానంద అన్నారు. ఏడు నెలల కాలంలో కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వలేదని... దీంతో, రియలెస్టేట్ కుదేలయిందని విమర్శించారు.


More Telugu News