నుదుటితో 30 సెకన్లలో 39 కూల్ డ్రింక్ క్యాన్లు నుజ్జునుజ్జు!

  • పాక్ యువకుడి వెరైటీ గిన్నిస్ రికార్డు
  • ఇప్పటికే గిన్నిస్ లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న రషీద్
  • బాబోయ్.. ఇదేం ఫీటు అంటూ విమర్శిస్తున్న నెటిజన్లు
పాకిస్థాన్ కు చెందిన ముహమ్మద్ రషీద్ అనే మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు తన టాలెంట్ ను వెరైటీగా ప్రపంచానికి చాటిచెప్పాడు. అర నిమిషంలో ఏకంగా 39 కూల్ డ్రింక్ క్యాన్లను తన నుదుటితో పగలగొట్టి ఔరా అనిపించాడు. ఇంకేముంది.. అతని అరుదైన ఫీట్ ను చూసిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు రషీద్ పేరును వారి పుస్తకంలోకి ఎక్కించేశారు. ‘30 సెకన్లలో తలతో అత్యధిక డ్రింక్ క్యాన్లను నుజ్జు’ చేసిన రికార్డును అతనికి కట్టబెట్టేశారు.

ఈ ఏడాది మే 19న రషీద్ ఈ ఫీట్ ను చేసి చూపగా అందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక టేబుల్ పై వరుసగా కొన్ని కూల్ డ్రింక్ క్యాన్లు పెట్టి ఉన్నాయి. వాటి పక్కనే రషీద్ నిలబడి ఉన్నాడు. కౌంట్ డౌన్ టైమర్ మొదలుకాగానే రషీద్ తన నుదుటితో క్యాన్లను బలంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆ ఒత్తిడికి క్యాన్ల మూతలు బద్దలై అందులోంచి కూల్ డ్రింక్ బయటకు విరజిమ్మడం మొదలైంది. అలా ఒక దాని తర్వాత ఒకటి చొప్పున మొత్తం 30 సెకన్లలో రషీద్ 39 కూల్ డ్రింక్ క్యాన్లను అవలీలగా బద్దలు కొట్టేశాడు. చివరకు అతను తల పైకెత్తి కెమెరా వైపు చూడగా నుదుటిన గాయమై కాస్త రక్తం కారడం కనిపించింది.

ఇక, రషీద్ కు గిన్నిస్ రికార్డులు నెలకొల్పడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ అతను పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అతను సాధించిన గిన్నిస్ రికార్డుల్లో నిమిషం వ్యవధిలో ఏకంగా 58 కూల్ డ్రింక్ క్యాన్లను నుదుటితో పగలగొట్టిన రికార్డు కూడా ఉంది. గతేడాది ఫిబ్రవరి 13న అతను ఈ రికార్డు సృష్టించాడు.

అయితే రషీద్ సాధించిన రికార్డు నెటిజన్లను ఏమాత్రం మెప్పించలేదు. ఇలాంటి రికార్డుల వల్ల తలకు లేదా తల లోపల గాయాలు కావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డుల కోసం ఇలాంటి సవాళ్లను ఎవరూ స్వీకరించరాదని.. అది ఎంతో ప్రమాదకరమని ఓ యూజర్ పేర్కొన్నాడు.  ‘అతనికి గిన్నిస్ సర్టిఫికెట్ తోపాటు కొంత నగదు కూడా ఇచ్చి ఉంటారనుకుంటున్నా. ఎందుకంటే.. అతనికి కచ్చితంగా వైద్య చికిత్స అవసరం’ అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు.


More Telugu News