నాకు అక్రమ సంబంధం అంటకట్టారు.. ఎవరినీ వదలను: విజయసాయిరెడ్డి

  • కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై బురద చల్లుతున్నారన్న విజయసాయి
  • రామోజీరావునే ధైర్యంగా ఎదుర్కొన్నానని వ్యాఖ్య
  • మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ధీమా
ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని... ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుసక్రమంలో బురద చల్లుతున్నారని విజయసాయి అన్నారు. సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం అంటకట్టేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వారని ఆమె చెప్పారని గుర్తు చేశారు. తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రామోజీరావునే తాను ధైర్యంగా ఎదుర్కొన్నానని... ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లకు బుద్ధి చెపుతానని అన్నారు. పరువునష్టం దావాతో పాటు పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని... ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతానని చెప్పారు. 

తన ఇంటికి ఒక టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారని... విజయసాయిరెడ్డిగాడు పారిపోయాడా? ఉన్నాడా? అని అడిగాడని... సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయిందని విజయసాయి తెలిపారు. వాడు టైమ్ చెపితే తానే వాడి ఇంటికి వెళ్తానని అన్నారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని... మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తోక ఆడించే వారి తోకలను తాము అధికారంలోకి వచ్చాక కట్ చేస్తామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము తగ్గేదే లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వ రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.


More Telugu News